
- నలుగురు దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
కొమురవెల్లి, వెలుగు: కొమొరవెల్లిలో రూమ్ లు అద్దెకు తీసుకుని, పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్ గా దొంగతనాలు చేస్తున్న నలుగురు ముఠాను కొమొరవెల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గురువారం కొమురవెల్లి పోలీసు స్టేషన్ లో హుస్నాబాద్ ఏసీపీ ఎస్.సదానందం, చేర్యాల సీఐ ఎల్. శ్రీనుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మహబూబాబాద్, కొత్త గూడెం జిల్లాలకు చెందిన బిజిలి సురేశ్, జంపయ్య, దాసరి అశోక్, ముదగోని సురేష్ దొంగల ముఠాగా ఏర్పాడ్డారు.
హైదరాబాద్ నేరెడ్మేట్, వినాయక నగర్ లో కిరాయికి ఉంటూ భక్తుల మాదిరిగా తరచూ కొమురవెల్లికి వచ్చి గదులు అద్దెకు తీసుకుంటున్నారు. భక్తుల మాదిరిగా బొట్టు పెట్టుకొని పగలు రెక్కీ నిర్వహించి, తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడ్డారు. నలుగురు వ్యక్తులపై పాత కేసులు ఉన్నాయని, మొత్తం 18 దొంగతనాలకు పాల్పడ్డట్టు గుర్తించినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు కూజ నర్సయ్య, అంగడి రవిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సుమారు 9 తులాల బంగారం, 22.5 తులాల వెండి, ఇనుప రాడ్డు,3 బైకులు, ఒక ఫోన్ రికవరీ చేశామని తెలిపారు.